Thursday 9 October 2014

దూసుకొస్తున్న హుధుద్: విశాఖకి 590కి.మీ. దూరంలో

విశాఖపట్నం: హుధుద్ సైక్లోన్ విశాఖకు ఆగ్నేయదిశలో 590, గోపాలపుర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరో పన్నెండు గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావం వల్ల శనివారం నుండి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అతి భారీ, భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హుధుద్ తీరం దాటే సమయంలో గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశముంది. ఈ ప్రభావం వల్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పోవడం, విద్యుత్ స్తంభాలు విరగడం, రైలు, రోడ్డు మార్గాలు కొట్టుకు పోవడం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశముంది. సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ మంత్రులు జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 25 రైల్వే స్టేషన్లలో అధికారులతో కూడిన రెస్క్టూ టీంలను సిద్ధం చేశారు. కోస్తా, ఉత్తరాంధ్రల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆహార పదార్థాలు తదితరాలను సిద్ధం చేశారు. కాగా, పెద్దపెద్ద చెట్లను కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తూ, కొండచరియలు విరిగిపడేలా చేస్తూ విద్యుత్‌, ఫోన్‌వైర్లను ధ్వంసం చేస్తూ అండమాన్‌ తీరాన హుధుద్ విధ్వంసం సృష్టించింది. బుధవారం విశాఖ తీరానికి 1000 కిలోమీటర్ల దూరాన సముద్రంలో ఉన్న ఈ తుఫాను.. గురువారం మధ్యాహ్నానికి విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 675 కిలోమీటర్ల దూరాన, గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. శుక్రవారం ఉదయానికి విశాఖకు ఆగ్నేయదిశలో 590, గోపాలపుర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మంగళ, బుధవారాల్లో గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో పరుగుపెట్టిన ఈ తుఫాన్‌.. గురువారం 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అలా పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం ఉదయానికి తీవ్ర పెను తుఫాన్‌గా మారనుంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం తీవ్ర పెను తుఫాన్‌ తీరం దిశగా వచ్చే కొద్దీ దాని ప్రభావం కనిపిస్తుంది. దాని ప్రకారం.. శుక్రవారం (11) నుంచి ఉత్తర కోస్తా, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు ప్రారంభమవుతాయి. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకూ, దక్షిణ ఒడిసాలో అనేక చోట్ల.. భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. కోస్తాలో మిగిలిన జిల్లాల్లో విస్తారంగా, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో 6.4 సెంటీమీటర్ల నుంచి 12.4 మేరకు వర్షం కురువొచ్చని, మరి కొన్ని ప్రాంతాల్లో 12.4 నుంచి 24 సెంటీమీటర్ల వర్షం కురువొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 24 సెంటీమీటర్లపైనే వర్షం కురువనుందని అంచనావేసింది. శనివారం ఉదయం నుంచి ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలు, దక్షిణ ఒడిశాలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, ఒక్కొక్కసారి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. 12వ తేదీ (ఆదివారం) ఉదయం నుంచి 130 నుంచి 140, అప్పుడప్పుడు 155 కిలో మీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయి. తీవ్ర పెను తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్ర అలలు రెండు మీటర్ల (ఆరున్నర అడుగుల) ఎత్తు వరకూ ఎగసిపడతాయి. దీంతో ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాల్లో సముద్ర తీరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. కోస్తాలో అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం నుంచి ప్రమాద హెచ్చరికల తీవ్రతను మరింత పెంచనున్నారు.

No comments:

Post a Comment