Monday 20 October 2014

ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయదు: కృష్ణమూర్తి

హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమను కలిసి ఆళ్లగడ్డలో పోటీ చేయవద్దని అభ్యర్థించినట్లు తెలిపారు. మైసూరారెడ్డి, తదితరులు తమను కలిశారని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా అంతకుముందు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు. ఆళ్లగడ్డలో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తామని ఆయనకు చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు సుముఖత చూపలేదు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ చనిపోయినప్పుడు ఆ స్థానంలో వారి కుటుంబీకులు పోటీ చేస్తే ఇతర పార్టీ తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకుండా చూడటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పాత సంప్రదాయాలు పాటించాలని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సర్ది చెప్పారు. గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పుడు జరిగిన ఆళ్లగడ్డ శాసనసభ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మాజీ పమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ గత శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.

No comments:

Post a Comment