Wednesday 15 October 2014

కెసిఆర్‌తో భేటీ: తెరాస వైపు కోమటిరెడ్డి చూపు

 కెసిఆర్‌తో భేటీ: తెరాస వైపు కోమటిరెడ్డి చూపు
హైదరాబాద్‌: కాంగ్రెసు నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు ఆ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. సాధారణ ఎన్నికల ముందు వివిధ సందర్భాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగింది. అప్పుడు టికెట్ల పంపిణీ సమయంలోనూ వారి పేర్లు టీఆర్‌ఎస్‌ ముఖ్యుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. మంగళవారం సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన వాహనం దిగిన వెంటనే కలిసి ఆయన వెంట సీ బ్లాక్‌లోకి వెళ్లారు. గంటకుపైగా వారి మధ్య మంతనాలు జరిగాయి. సీఎంతో భేటీ ముగిసిన పిదప కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టు చెప్పారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించాయి. తెరాస అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినందున విద్యుత్‌ కోతల నివారణకు ఇంకేం చేయగలదని ప్రశ్నించారు. జిల్లాలో జారతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వైద్యకళాశాల నిర్మించాలని కోరినట్టు తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులు వేగంగా పూర్తి చేయాలని కోరినట్టు ఆయన చెప్పారు. విద్యుత్ సంక్షోభంపై కొత్తగా ఏర్పడిన తెరాస ప్రభుత్వాన్ని ఎలా తప్పు పడతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపేందుకు కొంత సమయం ఇవ్వాలని అన్నారు. పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను పార్టీలో ఎవరూ పట్టించుకోరని, ఆయనకు ఉద్యమాలు చేసిన అనుభవం లేదు, గతంలో ఏ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనలేదని తెలిపారు. తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావలసిన విద్యుత్ రాకుండా చంద్రబాబు అడ్డుకోవడం తగదని అన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విద్యుత్ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెరాసలో చేరుతున్నట్లు జరిగిన ప్రచారంపై ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని, టిఆర్‌ఎస్‌లో చేరడం లేదని, జిల్లాకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రావడానికే వచ్చానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment